Amit Shah: ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్‌గా కేంద్ర హోం మంత్రి విమర్శలు గుప్పించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో మంగళవారం పర్యటించిన ఆయన, కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. మహేంద్రగఢ్‌లో జరిగిన ‘‘బీసీ సమ్మాన్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు. ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు 1950లలో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ ఏళ్ల తరబడి కమిషన్ సిఫారసులను అమలు చేయలేదని అన్నారు.
Read Also: Raghav Chadha: వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం.. కాంగ్రెస్ విమర్శలు
1980లో, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘మండల్ కమిషన్’ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారని, 1990లో దానిని ఆమోదించిన సమయంలో, రాజీవ్ గాంధీ రెండున్నర గంటలు ప్రసంగించి ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని అమిత్ షా గుర్తు చేశారు. కర్ణాటకలో వెనకబడిన వర్గాల రిజర్వేషన్లను లాక్కుని కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చిందని, హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందని అమిత్ షా అన్నారు.
హర్యానాలో ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతించబోమని తాను హామీ ఇస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. హర్యానాలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 15 రోజుల్లో హర్యానాలో అమిత్ షా పర్యటించడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 29న పంచకులతో జరిగిన బీజేపీ విస్తృత రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో అమిత్ షా మాట్లాడారు.