Congress: 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం నిలబెట్టుకోవాలని, కానీ పార్టీ 44 సీట్లకు మాత్రమే పరిమితమైందని అన్నారు. ‘‘అప్పుడే ఆట మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 206 నుంచి పెరగకూడదని నిర్ణయించారు’’ అని అన్నారు. దీనికి సీఐఏ, మొసాద్ కుట్రే కారణమని చెప్పారు.
ఈ రెండు సంస్థలు భారతదేశంలో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాయని, స్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత్ విషయంలో జోక్యం చేసుకునేవారి విధానాలు అమలు చేయలేకపోయేవారు అని కేట్కర్ అన్నారు. ఇజ్రాయిల్ మొసాద్ నియోజకవర్గాల వారీగా వివరణాత్మక డేటాను సిద్ధం చేసిందని ఆయన ఆరోపించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ 206 స్థానాల నుంచి 44కు పడిపోయేంత అసంతృప్తి మాత్రం లేదని చెప్పారు. భారతదేశం బాల్కనైజేషన్ ఎదుర్కోవాలని బ్రిటీష్ వారు కోరుకున్నారని ఆయన అన్నారు.