Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్‌కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
జనవరి 30న మేయర్ ఎన్నిక జరగబోతున్న తరుణంలో ఈ పరిణామం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ మేయర్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ రోజు సుప్రీంకోర్టు స్వతంత్ర పరిశీలకుడి నియమిస్తామని చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలకుడి పేరు లేకుండా ఈ ఉత్తర్వును జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆయన సమక్షంలోనే నిర్వహించాలని మరియు దానిని వీడియోలో చిత్రీకరించాలని పేర్కొంది. స్వతంత్ర పరిశీలకుడికి గౌరవ వేతనం చెల్లిస్తామని చెప్పింది.
Read Also: Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు
చండీగఢ్ మేయర్ ఎన్నికలు గతేడాది నుంచి చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ లబ్ది చేకూరేలా రిటర్నింగ్ అధికార బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా 8 ఓట్లు చెల్లకుండా చేయడం కెమెరాలో రికార్డైంది. దీనిపై అతను సుప్రీంకోర్టు ముందు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మేయర్ ఎన్నికల్ని నిష్పాక్షికంగా నిర్వహించేందుకు, బ్యాలెట్‌కి బదులుగా చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ యాదవ్ సుప్రీకోర్టుని ఆశ్రయించారు.
ప్రస్తుతం బలాబలాను చూస్తే బీజేపీకి 16 మంది, ఆప్-కాంగ్రెస్ కూటమికి 20 మంది కౌన్సిలర్ల బలం ఉంది. పార్టీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆప్ తన కౌన్సిలర్లను రోపర్‌లోని ఒక హోటల్‌కి తరలించింది. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో విభేదాల కారణంగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు హోటల్ వెళ్లేందుకు నిరాకరించారు. ఆప్ నుంచి ప్రేమ లత మేయర్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.