Milind Deora: 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని మిలింద్ దేవరా వదిలేశారు. మహారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఈ రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందుకు శివసేనలో చేరినట్లు వెల్లడించారు.
పార్టీలో చేరుతూ.. ‘‘మనం రోజూ చూస్తున్నాం ఒక చాయ్‌వాలా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధాని అయ్యారు. ఆటోరిక్షా డ్రైవర్ దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఈ మార్పు భారతదేశ రాజకీయాలను మెరుగుపరుస్తుంది. మన సమానత్వపు విలువలను పునరుద్ఘాటిస్తుంది’’ అని ఆయన ప్రధాని మోడీ, సీఎం ఏక్‌నాథ్ షిండేలపై ప్రశంసలు కురిపించారు.
Read Also: Shashi Tharoor: వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ, కానీ.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు..
దేశంలో అత్యంత కష్టపడే, అందరికి అందుబాటులో ఉండే సీఎం ఏక్‌నాథ్ షిండే అని అన్నారు. మహారాష్ట్రలో అనగారిని వర్గాలపై ఆయనకున్న అవగాహన, పాలన, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల దార్శనికత తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. ముంబై, మహారాష్ట్రలకు సంపన్నమైన భవిష్యత్తు కోసం సీఎం షిండే ప్రయత్నాలకు మద్దతు ఇస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తీరుపై ఆయన మండిపడ్డారు. కీలకమైన రాజకీయ నిర్ణయాల సమయంలో తను పార్టీ పక్కనపెట్టినట్లు చెప్పారు. పదేళ్ల పాటు నేను వ్యక్తిగత హోదా, అధికారాన్ని ఆశించకుండా పనిచేశానని అన్నారు.