Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు.
Read Also: Komuravelli Railway Station: మల్లన్న భక్తులకు శుభవార్త.. కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్
గత మూడు నెలల్లో దాదాపు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించారు. పశ్చిమ మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో అరకాన్ ఆర్మీ మిలిటెంట్లు సైనిక స్థావరాలను చేజిక్కించుకున్న తర్వాత వందలాది మంది సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందారు. మరోవైపు ఇటీవల మణిపూర్ ఘర్షణల్లో కూడా మయన్మార్ మిలిటెంట్ల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలను అడ్డుకోవడానికి ఫ్రీ మూమెంట్ రెజిమ్(ఎఫ్ఎంఆర్)ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారతదేశం-మయన్మార్ సరిహద్దులో నివసించే ప్రజలు కుటుంబ మరియు జాతి సంబంధాలను కలిగి ఉన్నందున 1970లలో FMR తీసుకురాబడింది.
2021లో మయన్మార్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దెదించి, కీలక నేత అంగ్సాంగ్ సూచీని అక్కడి సైన్యం అరెస్ట్ చేసి పాలనను తమ చేతుత్లోకి తీసుకుంది. దీంతో అప్పటి నుంచి జుంటా పాలకులకు వ్యతిరేకంగా చాలా మంది తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సైనికులు తిరుగుబాటుదారుల దెబ్బకు ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.