Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాలులో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి మృతదేహం కనుగొన్న తర్వాత, ఘటన గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో జాప్యం చేసినట్లు సీబీఐ కనుగొంది. దాదాపుగా 40 నిమిషాల తర్వాత స్థానిక పోలీసులకు ఈ ఘటన గురించి మెడికల్ కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ఆస్పత్రి అధికారులు యత్నించి ఉండొచ్చని సీబీఐ అనుమానిస్తున్నట్లు సమాచారం.
కోల్‌కతా పోలీసుల టైమ్ లైన్ ప్రకారం.. మృతదేహాన్ని ఉదయం 9.30 గంటలకు కనుగొంటే, 40 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు తాలా పోలీస్ స్టేషన్‌కి మొదట సమాచారం అందించారు. మృతదేహం కనుగొన్న గంట తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నేర స్థలాన్ని భద్రపరచడంలో ఒక గంట ఆలస్యమైంది. ఈ కేసులో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జోక్యం చేసుకున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సీబీఐ అతని కాల్ డిటెయిల్ రికార్డులను (సిడిఆర్) కూడా పరిశీలిస్తోంది. శుక్రవారం 14వ సారి ఘోష్‌ను విచారణకు పిలిచారు.
ఈ సంఘటనల క్రమంలో పోలీసుల ప్రతిస్పందన అర్థం చేసుకునేందుకు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారిని కూడా సీబీఐ ప్రశ్నించింది. కోల్‌తకా పోలీసులు సీబీఐ చేసిన వాదనల్ని తోసిపుచ్చారు. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటర్ క్రైమ్ సీన్‌లో ‘‘రాజీ పడలేదు’’ అని పేర్కొంది. క్రైమ్ సీన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సెమినార్ హాలులో చాలా మంది ఉన్నట్లు చూపించింది. క్రైమ్ సీన్ మార్చబడిందన్న సీబీఐ వాదనల్ని కోల్‌కతా పోలీసులు ఖండించారు.