Jairam Ramesh: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన రాజ్యసభ సీటు వద్ద నుంచి రూ. 50,000 దొరకడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సభ చైర్మన్ జగదీప్ ధంఖర్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం స్పందించారు. సభలోకి రూ. 50,000 నగదును తీసుకెళ్లడం అసాధారణం లేదా అనుమానాస్పదంగా లేదని ఆయన అన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఇతర ఎంపీలు కూడా పార్లమెంట్‌కి ఇదే మొత్తాన్ని తీసుకెళ్లినట్లు అంగీకరించారు.
Read Also: Pushpa 2: ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే!
మను సింఘ్వీ పేరును తీసుకురావడం తప్పు, సాయంత్రం 6 గంటల తర్వాత సభలో సోదాలు జరిగాయి, డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? దర్యాప్తు చేస్తే విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు నుంచి తాము తప్పించుకోవడం లేదని, ఇది ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు.
బీజేపీ ఎంపీలతో సహా 5-6 మందితో తాను అంతకుముందు రోజు మాట్లాడానని, వారు రూ. 50,000 చూపించారని జైరాం రమేష్ అన్నారు. ఎవరైనా జేబులో రూ. 50 వేలు ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పారు. అయితే, ఈ ఆరోపణల్ని సింఘ్వీ తోసిపుచ్చారు. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, పార్లమెంట్‌కి హాజరయ్యేటప్పుడు సాధారణంగా తాను రూ. 500 మాత్రమే తీసుకెళ్తానని చెప్పారు. దర్యాప్తు పూర్తికాకముందే సింఘ్వీ పేరును చైర్మన్ ధంఖర్ బయటపెట్టారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.