Cakes: కొన్ని కేక్‌లలో ‘‘క్యాన్సర్’’ కారక పదార్థాలు ఉండే అవకాశం ఉందని కర్ణాటక ఆహార భద్రత-నాణ్యత విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రెండు నెలల క్రితం కబాబ్‌లు, మంచూరియన్, పానీ పూరీలతో సహా రాష్ట్రంలోని కొన్ని స్ట్రీట్ ఫుడ్ శాంపిల్స్‌లో కార్సినోజెన్స్ అని పిలువబడే క్యాన్సర్ కారక పదార్ధాల ఉనికిపై ఆహార భద్రతా విభాగం ఇదే విధమైన ఆందోళనల్ని లేవనెత్తింది. తాజాగా కేకుల్లో కూడా కార్సినోజెన్స్ ఉండే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
ఆగస్టులో 235 కేక్ శాంపిళ్లను విశ్లేషించింది. ఇందులో 223 సురక్షితమే అని, అయితే 12 కేకుల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ తెలిపింది. కేకుల్లో ఉపయోగించి కృత్రిమ రంగులైన అల్లూరా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సీయు 4ఆర్ (స్ట్రాబెర్రీ రెడ్), టార్ట్రాజైన్ (నిమ్మ పసుపు), కార్మోయిసిన్ (మెరూన్) వాటిని సురక్షితమైన స్థాయికి మించి ఉపయోగిస్తే క్యాన్సర్ ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించింది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయొచ్చని తెలిపింది.
Read Also: Thalapathy 69: గ్రాండ్ గా మొదలైన దళపతి విజయ్ చివరి సినిమా
ముఖ్యంగా ‘‘రెడ్ వెల్వెట్’’, ‘‘బ్లాక్ ఫారెస్ట్’’ వంటి ప్రసిద్ధమైన కేకులు తరుచుగా వైబ్రెంట్ కలర్స్‌తో తయారవుతాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరించారు. బేకరీలు కేకుల తయారీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ రసాయనాలు తక్కువగా వినియోగిస్తే బాగానే ఉంటాయి, కానీ ఎక్కువగా వాడితే మాత్రం ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు. కేకులు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు వీటిని అధిక మొత్తాల్లో వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రకృతిలో లేని రంగురంగుల టొమాటోలను, అతిగా మెరిసే యాపిల్‌లను ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఆకర్షించేందుకు వాటికి కృత్రిమ రంగులు వినియోగిస్తున్నారు. చాలా వరకు ప్యాక్ చేసిన ఆహారంలో టైటానియం డయాక్సైడ్ ఉంటుంది, దీనిని భారత్‌లో అనుమతించారు, కానీ యూరప్, ఇతత మిడిల్ ఈస్ట్ దేశాల్లో దీనిపై నిషేధం ఉందని ఆహార నిపుణులు చెబుతున్నారు.