West Bengal: వెస్ట్ బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా పలు మండపాలపై దాడులు జరిగాయి. దీనిపై కలకత్తా హైకోర్టు రాష్ట్ర డీజీపీ నుంచి నివేదిక కోరింది. వివిధ జిల్లాల్లో దుర్గాపూజ సందర్భంగా జరిగిన సంఘటనలు, వారు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు డీజీపీకి నివేదిక సమర్పించాలని జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్య నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ఆదేశించింది. డీజీపీ అన్ని నివేదికను పరిశీలించి, ఫైనల్ రిపోర్టుని హైకోర్టుకు సమర్పిస్తారు. నవంబర్ 14న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించాలి.
విశ్వహిందూ పరిషత్ నదియా జిల్లా శాఖ అధ్యక్షురాలు రీతూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దుర్గాపూజ పండల్‌పై జరిగిన దాడులపై పారదర్శక దర్యాప్తునకు ఆదేశించాలని రితూ పిటిషన్‌లో కోర్టును కోరారు. దర్యాప్తు బాధ్యతను రాష్ట్ర ఏజెన్సీలకు బదులు స్వతంత్ర సంస్థకు అప్పగించాలని సింగ్ కోర్టును ఆశ్రయించారు.
Read Also: Diwali 2024: కేరళతోపాటు దేశంలోని ఈ ప్రాంతాల్లో దీపావళి జరుపుకోరు.. ఎందుకో తెలుసా?
ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరైన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.. దుర్గాపూజ మండపాల వద్ద జరిగిన అనేక దాడుల సంఘటనలు పిటిషన్ పేర్కొన్నప్పటికీ, రీతూ సింగ్ ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. నివేదిక సమర్పించేందుకు కోర్టు నుంచి సమయం కోరాడు. అయితే, దుర్గా నవరాత్రుల సమయంలో బెంగాల్‌లోని వివిధ జిల్లాలో జరిగిన అనేక దాడుల గురించి రీతూ సింగ్ తరుపు న్యాయవాది ప్రస్తావించారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలో దుర్గా మండపంపై దుండగులు దాడి చేశారని, కోచ్‌బెహార్‌లోని శీతాల్ కుచి, హౌరాలోని శ్యాంపూర్ మరియు నదియా జిల్లాలోని విగ్రహాలను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.
అయితే, విచారణను ఎందుకు బదిలీ చేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాదిని జస్టిస్ భట్టాచార్య ప్రశ్నించారు. దీనికి లాయర్ స్పందిస్తూ.. రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారని, ఈ విచారణని రాష్ట్రంలో చేయలేమని చెప్పారు. ఈ సంఘటన కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల్లో జరిగాయని, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే నిష్పాక్షిక దర్యాప్తు ఉందని చెప్పారు.