Nashik Fire Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 11 మంది మరణించారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి యావత్మాల్ నుంచి నాసిక్ వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు నాసిక్-ఔరంగాబాద్ రోడ్డులోని హెటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. బస్సు డిజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులంతా నిద్ర పోతుండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు బస్సు నుంచి దూకేశారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది ప్రయాణికులు అందులో చిక్కుకు పోయారు.
Read Also: Blast in Police Station: పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు..
ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. బస్సు నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గాయపడినవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింతగా మరణాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
నాసిక్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.