Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టే బదులు, సీపీఎం భారతదేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని కోరింది. ‘‘మనదేశంలో తగినన్ని సమస్యలు ఉన్నాయి. మనకు ఇలాంటివ వద్దు. మీరు చిన్న దృష్టితో చూస్తున్నారని చెప్పడానికి బాధగా ఉంది. మీరు గాజా, పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు. మీ సొంత దేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. ఇది దేశభక్తి అనిపించుకోదు.’’ అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Read Also: Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై చైనా ఆగ్రహం..
‘‘మీరు భారతదేశంలో నమోదైన ఒక సంస్థ. చెత్త డంపింగ్, కాలుష్యం, మురుగునీరు, వరదలు వంటి సమస్యలను చేపట్టాలి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిపై మీరు పోరాటం చేయడం లేదు కానీ వేల మైళ్ల దూరంలోని వేరే దేశం కోసం పోరాడుతున్నారు’’ అని సీపీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దేశ విదేశాంగ విధానం సీపీఎం తీసుకున్న వైఖరిని భిన్నంగా ఉందని హైకోర్టు గమనించింది. ఇలాంటి నిరసనలు దౌత్యపరమైన పరిణామాలకు దారి తీస్తాయని హెచ్చరించింది.
‘‘పాలస్తీనా, ఇజ్రాయిల్ వైపు ఉండటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో మీకు తెలియదు. మీరు ఎందుకు దీన్ని చేయాలనుకుంటున్నారు..? ఇది దేశ విదేశాంగ వ్యవహారాలకు ఎలాంటి నష్టం చేస్తుందో మీకు అర్థం కావడం లేదు’’ అని ధర్మాసనం హెచ్చరించింది. భారత విదేశాంగ విధానంపై ఆందోళనలను చూపుతూ, గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ఆజాద్ మైదాన్‌లో నిరసన నిర్వహించడానికి ఆల్ ఇండియా సాలిడారిటీ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన దరఖాస్తును జూన్ 17న ముంబై పోలీసులు తిరస్కరించారు. సీపీఎం హైకోర్టులో తిరస్కరణను సవాల్ చేసింది.
సీపీఎం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ మాట్లాడుతూ.. పోలీసులు భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ఉందని, శాంతిభద్రతలకు దారి తీయచ్చనే కారణాలతో పోలీసులు అనుమతి నిరాకరించారని కోర్టు దృష్టి తెచ్చారు. అయినప్పటికీ, ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని వాదించారు. ప్రభుత్వం వాదనలు కూడా విన్న కోర్టు సీపీఎం పిటిషన్‌ని తిరస్కరించింది.