Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్‌ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ వ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి అంత సీను లేదు, మీడియా అతిగా చూపించింది..
అక్టోబర్ 2024లో, కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ఇద్దరు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అదే సంవత్సరం మార్చిలో, ఉత్తర పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఐదుగురు చైనా కార్మికులు మరణించారు. ఈ దాడులపై చైనా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)లోని అనేక ప్రాజెక్టుల్లో చైనా ఇంజనీర్లు, నిపుణులు పనిచేస్తున్నారు. అయితే, అక్కడి తాలిబాన్లు, బలూచిస్తాన్ రెబల్స్ వీరిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు.
చైనా, పాకిస్తాన్ మధ్య సోదరభావం కాలపరీక్షలకు తట్టుకుని నిలబడిందని, రాయిలా దృఢంగా ఉందని మునీర్ అన్నారు. పాకిస్తాన్ సైన్యం చైనా పౌరులు భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మేలో భారత్ భంగపాటు గురైన తర్వాత, చైనాకు మొదటిసారిగా ఆసిమ్ మునీర్ వెళ్లారు. చైనాకు అన్ని విషయాల్లో పాకిస్తాన్ సహకరిస్తుందని మునీర్ పునరుద్ఘాటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఫీల్డ్ మార్షల్ హోదా పొందినందకు ఆసిమ్ మునీర్‌ను అభినందించారు. పాకిస్తాన్ తమ ఉక్కు స్నేహితుడని, ఆల్-వెదర్ ఫ్రెండ్‌గా అభివర్ణించారు. పాకిస్తాన్‌కి చైనా తిరుగులేని మద్దతు ఇస్తుందని చెప్పారు.