Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ సరిహద్దు వెంబడి భారత పోస్టులపై పాక్ కాల్పులు..
ఈ పరిణామంపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్(ట్విట్టర్) వేదిక విమర్శలు చేశారు. ‘‘అమేథిలో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, రాయ్ బరేలీ తర్వాతి స్థానంలో ఉంది. రాజ్యసభకు వెళ్లాలనే సోనియా గాంధీ నిర్ణయం పొంచి ఉన్న ఓటమిని అంగీకరించడమే’’అని ఆయన కామెంట్ చేశారు. గాంధీలు ఇప్పుడు తమ కంచుకోటల్ని విడిచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ (సమాజ్వాదీ పార్టీ) 11 సీట్లు ఇచ్చినప్పటికీ యూపీలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని బీజేపీ నేత చెప్పారు.
రాజస్థాన్లోని మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోనుంది. ఏప్రిల్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ స్థానం ఖాళీ కానుంది. ఐదు సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో రాయ్ బరేలీ నుంచి తొలిసారిగా ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబం నుంచి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న రెండో వ్యక్తిగా సోనియా గాంధీ గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాలు బీజేపీకి వస్తాయని గాంధీ కుటుంబానికి తెలుసు కాబట్టి ఉత్తర్ ప్రవేశ్ని వదిలిపెట్టారని అన్నారు.