గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగీతో బాధపడుతూ అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం నాడు కన్నుమూశారు. గతంలో ఆశాబెన్ పటేల్ కరోనా బారిన కూడా పడ్డారు. ఇప్పుడు డెంగీ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయారు. ఆమె మరణ వార్తను జైడస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. గతంలో ఆరు సార్లు బీజేపీ తరపున ఉంఝా స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్ పటేల్‌ని ఆమె 2017 ఎన్నికల్లో మట్టి కరిపించారు.
Read Also: గుడ్ న్యూస్: 6 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్
అయితే కాంగ్రెస్ పార్టీతో విభేదాలు రావడంతో 2019లో ఆశాబెన్ పటేల్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. కాగా 2015లో ఆశాబెన్ పటేల్ పాటిదార్ రిజర్వేషన్ల అంశంపై పోరాడిన కీలక వ్యక్తుల్లో ఒకరు. ఆమె హార్దిక్ పటేల్‌కు సన్నిహితురాలు. ఆశాబెన్ పటేల్ మృతి పట్ల సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.