Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు మోడీ దౌత్య వైఖరిని తప్పుబడుతూ మూర్ఖంగా(ఎగ్ ఆన్ ఫేస్) వ్యవహరించానంటూ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనియాడారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా, సొంత పార్టీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది.
Read Also: Pakistan: “పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది”.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..
థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘శశి థరూర్ అంగీకరించిన విధంగా, కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కూడా చేయాలి’’ అని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ థరూర్ నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేత సంబిత్ పాత్ర చెప్పారు. ‘‘”శశి థరూర్ దౌత్యాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన చాలా కాలంగా ఐక్యరాజ్యసమితిలో ఉన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో ప్రధాని మోడీ వైఖరిని ఆయన అభినందించారు. కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కూడా ప్రతిసారీ ప్రధాని మోడీకి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే బదులు శశి థరూర్ నుండి నేర్చుకోవాలి… మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ ముందుకు వచ్చి శశి థరూర్ వైఖరిని అభినందించాలి’’ అని అన్నారు. కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. శశిథరూర్ నిజాయితీని మెచ్చుకుంటున్నానని చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ వైఖరిపై బహిరంగంగానే థరూర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. స్టార్టప్ రంగంలో కేరళ పురోగతిని పొగిడారు. తనను పార్టీ కోరుకోకపోతే, తనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని కాంగ్రెస్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిన్న రెసినా డైలాగ్‌లో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై తాను భారత వైఖరని గతంలో తప్పుగా అంచనా వేశానని, రెండు వారాల్లో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని భేటీ అయ్యారని, ఇలా రెండు దేశాలకు మిత్రదేశంగా భారత్ ఉందని చెప్పారు. ఇది ప్రపంచ శాశ్వత శాంతికి మార్పు తీసుకురాగలదని అన్నారు.