Urban Naxalism Bill: ‘‘అర్బన్ నక్సలిజాన్ని’’ అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు, 2024ని గురువారం తీసుకువచ్చింది. ఈ బిల్లు ద్వారా వ్యక్తులు, సంస్థలు, 48 నిషేధిత ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ యొక్క చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిరోధించవచ్చని మహా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నక్సల్ ఫ్రంటల్ సంస్థలు లేదా ఇలాంటి సంస్థల ప్రభావవంతమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఆమోదించిన ప్రజా భద్రతా చట్టం తరహాలో ఈ బిల్లు రూపొందించబడింది.
ఈ బిల్లను రాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ప్రవేశపెట్టారు. నక్సలిజం ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత చట్టాలు అసమర్థమైనవని, అయితే ఇవి సరిపోవదని, చట్టపరమైన మార్గాల ద్వారా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త చట్టం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. నక్సల్స్ సాహిత్యం మహారాష్ట్రలోని అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని, నక్సల్ సంస్థలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుని ప్రచారం చేయడంతో పాటు, ప్రజాశాంతికి విఘాతం కలిగించడానికి, సాధారణ ప్రజల్లో అశాంతికి కారణమవుతున్నాయని బిల్ పేర్కొంది.
Read Also: Fake IAS: ఐఏఎస్ అని చెప్పి పెళ్లి.. భార్యను నమ్మించి రూ.2 కోట్లు వసూలు చేశాడు..!
బిల్లు ప్రకారం, పబ్లిక్ ఆర్డర్, శాంతి మరియు ప్రశాంతతకు ప్రమాదం లేదా ముప్పు కలిగించే లేదా పబ్లిక్ ఆర్డర్ నిర్వహణకు అంతరాయం కలిగించే లేదా జోక్యం చేసుకునే లేదా చట్టం లేదా చట్టాన్ని అమలుపరిచే సంస్థలు మరియు సిబ్బంది పరిపాలనలో జోక్యం చేసుకునే ఎలాంటి చర్య అయినా ఇది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కిందకు వస్తుందని పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం, ఇలాంటి సంస్థల సమావేశాల్లో పాల్గొనడం, సహకారం అందించే వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించబడుతుంది. ఈ సంస్థల్ని నిర్వహించే, నిర్వహణలో సాయం చేయడం, సమావేశాలను ప్రోత్సహించడం చేస్తే అలాంటి వ్యక్తులు 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమా విధిస్తారు. చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడే లేదా ప్రోత్సహించే వారు, ప్రయత్నించే వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించబడుతుంది.