Nitish Kumar’s Test Of Majority Today: బీహార్ పాలిటిక్స్ లో నేడు కీలక ఘట్టం జరగబోతోంది. నితీష్ కుమార్ సర్కార్ బల నిరూపణ పరీక్షకు సిద్ధం అయింది. ఈ రోజు అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరగనుంది. నితీష్ కుమార్ తన సర్కార్ మెజారిటీని నిరూపించుకోనున్నారు. ఈ నెల మొదట్లో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు మిత్ర పక్షంగా ఉన్న బీజేపీని కాదని.. ఆర్జేడీతో జతకట్టారు సీఎం నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. రాజీనామా చేసి తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో బీహార్ రాష్ట్రానికి ఎనిమిదో సారి సీఎంగా పదవీ బాధ్యతలను చేపట్టారు. డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో పాటు మొత్తం 31 మంది మంత్రులతో కొత్త మంత్రి వర్గం ఏర్పడింది.
Read Also: Swapna Dutt: ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. రివీల్ చేసిన టాప్ ప్రొడ్యూసర్ కుమార్తె
ప్రస్తుతం నితీష్ ప్రభుత్వానికి మొత్తంగా 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో బలనిరూపణ కేవలం నామమాత్రమే. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ప్రస్తుతం మెజారిటీ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మొత్తం 242 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122 అయితే.. మ్యాజిక్ ఫిగర్ కన్నా మరో 40కి పైగా ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జేడీయూకు 45, కాంగ్రెస్ పార్టీకి 19, సీపీఐ(ఎంఎల్)12 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొన్ని పార్టీల మద్దతు నితీష్ కుమార్ కు ఉంది. విపక్షం బీజేపీకి 77 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు.
అయితే ఆర్జేడీ-జేడీయూ మహాఘటబంధన్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీహార్ లో ఆర్జేడీ మరోసారి జంగిల్ రాజ్ పాలన తీసుకువస్తుందని విమర్శిస్తోంది. అయితే ఈ విమర్శలను ఇటు బీజేడీ, అటు జేడీయూ పార్టీలు తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో 31 మంది మంత్రులు ఉంటే ఆర్జేడీకి 16, జేడీయూకు 11, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు.