Bihar Election Results: బీహర్ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కన్నా ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ కూటమి 190కి పైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి ఘోర పరాజయం కైవసం చేసుకోబోతోంది. కేవలం 50 సీట్లకు లోపే ఈ కూటమి ఉండబోతోంది. ఇదిలా ఉంటే, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌కు రాఘోపూర్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదురవుతోంది. కొన్ని రౌండ్స్‌లో వెనకంజలోకి వెళ్లాడు. లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గంలో ఓటమి దిశగా వెళ్తున్నారు.
ఆర్జేడీకి కంచుకోటగా ఉన్న రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. యాదవ్ ఒక దశలో సతీష్ కుమార్ యాదవ్ కన్నా 13,000 ఓట్ల లేడాతో వెనకబడి ఉన్నాడు. మధ్యాహ్నం నాటికి స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే, 15 ఏళ్ల క్రితం లాలూ భార్య, తేజస్వీ తల్లి రబ్రీదేవీని ఇదే సతీష్ కుమార్ రాఘోపూర్‌లో ఓడించారు. ఈసారి తేజస్వీని ఓడిస్తారా.? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Read Also: Bihar Election Results: బీహార్‌లో “ని-మో” జోడి ప్రభంజనం.. అండగా నిలిచిన మహిళలు..
ఎవరీ సతీష్ కుమార్?
59 ఏళ్ల సతీష్ కుమార్ తన రాజకీయ ప్రయాణాన్ని ఆర్జేడీ నుంచే మొదలుపెట్టారు. బీహార్ జనాభాలో యాదవులు 15 శాతం ఉంటారు. వీరిలో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. 2005లో సతీష్ కుమార్ జేడీయూలో చేరారు. రాఘోపూర్ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో రబ్రీదేవీ ఆయనను 25 వేల పైచిలుకు ఓట్లతో ఓడించింది. అయితే, 2010 ఎన్నికల్లో సతీష్ కుమార్ 13,000 ఓట్ల తేడాతో రబ్రీ దేవీని ఓడించారు. 2015లో ఆయన తన స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరారు. ఇప్పుడు, తేజస్వీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప తేడా మాత్రమే ఉండే అవకాశం ఉంది.