Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే లాటరీ కింగ్‌గా పిలువబడే శాంటియాగో మార్టిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మొత్తం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో ఈయన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా.. ఇందులో ఏకంగా 37 శాతం అంటే రూ. 509 కోట్లు విరాళంగా తమిళనాడు అధికార పార్టీకి డీఎంకేకి ముట్టచెప్పింది. డీఎంకేకి మొత్తం విచ్చని విరాళాలు రూ. 656.5 కోట్లు కాగా, ఒకే సంస్థ ఈ స్థాయిలో నిధులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు) మరియు సన్ టివి (రూ. 100 కోట్లు)లు డీఎంకేకు విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నారు. ఎలక్షన్ కమీషణ్ ఈ రోజు ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను ప్రజల ముందుంచింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019 ముందు కాలానికి చెందినివిగా భావిస్తున్నారు. ఈ డేటా ప్రకారం.. 2018లో బాండ్‌లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) తర్వాత కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు) BRS (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ.944.5) తర్వాతి స్థానాల్లో ఉండగా.. డీఎంకే ఆరో స్థానంలో ఉంది.
Read Also: MK Stalin: సీఏఏ తర్వాత బీజేపీ టార్గెట్ ఇదే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
శాంటియాగో మార్టిన్ ఎవరు..?
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ప్రస్తుతం ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అధినేత శాంటియాగో మార్టిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019-2024 మధ్య ఏకంగా రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాడు.
మార్టిన్ తన టీనేజ్‌లో ఉన్నప్పుడు లాటరీ టిక్కెట్లు విక్రయించేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ లాటరీ నుంచి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. టీనేజ్ వయసులో మయన్మార్‌లో పనిచేసి, 1980 చివర్లో భారత్‌కి తిరిగి వచ్చాడు. కోయంబత్తూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని విస్తరించాడు.
ఇతని టూ డిజిట్ లాటరీ ఈ ప్రాంతంలో విశేష ఆదరణ పొందింది. మార్టిన్ ఇతర రాష్ట్రాలకు, చివరకు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్‌లకి కూడా విస్తరించాడు. ఈ దేశాల్లో లాటరీ టికెట్ల విక్రయంలో ఇతడి గుత్తాధిపత్యం ఉందని సమాచారం. కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో మార్టిన్ వ్యాపార ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాయి. మార్టిన్ గ్రూప్ చట్టాలను పాటిస్తు్న్నాయని మార్టిన్ చెబుతున్నాడు.