పదో తరగతి అంటేనే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంతో కష్టపడితేనే గానీ.. చదువు ముందుకెళ్లదు. అందుకే తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెట్టి చదివిస్తుంటారు. అదే తల్లిదండ్రుల పాలిట శాపమైంది. ఫోన్ చూడకుండా చదువుకోమని తల్లి చెప్పడమే పాపమైంది. ముందు వెనుక ఆలోచించకుండా 20వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. నవమాసాలు మోసి కని..పెంచిన తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన బెంగళూరులోని కడుగోడి శివారు ప్రాంతంలోని అసెట్జ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది.
ఇది కూడా చదవండి: KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
అవంతిక చౌరాసియా అనే 15 ఏళ్ల బాలిక.. బెంగళూరులోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మార్చి 15 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీంతో పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులకు స్టడీ లీవ్ ఇచ్చింది. దీంతో విద్యార్థులంతా పుస్తకాలను దగ్గర పెట్టుకుని కుస్తీ పడుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం అవంతిక చదువుకోకుండా ఫోన్‌లో నిమగ్నమైంది. దీన్ని గమనించిన తల్లి.. ఫోన్ పక్కన పెట్టి చదువుకోమని మందలించింది. అంతే కోపోద్రేకురాలైన అవంతిక..గది కిటికీ తలుపులు తీసి 20వ అంతస్తు నుంచి కిందకి దూకింది. గమనించిన తల్లి..వేగంగా కిందకి వెళ్లి చూడగా.. తలకు బలమైన గాయాలు తగలడంతో సంఘటనాస్థలిలోనే అవంతిక ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. తల్లి మందలింపుతో అవంతిక మనస్తాపం చెంది తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కడుగోడి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైట్‌ఫీల్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ గుణారే మాట్లాడుతూ.. అవంతిక మరణాన్ని ధృవీకరించారు. బాధిత కుటుంబం మధ్యప్రదేశ్‌కు చెందినదిగా తెలిపారు. అవంతిక తండ్రి లక్ష్మీకాంత్ చౌరాసియా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా.. తల్లి గృహిణిగా ఉంది. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: YSRCP: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన వైసీపీ.. ఇది అక్రమం