Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి. అయితే ఈ రోజు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అమేథీ నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎదుర్కొనేందుకు కిషోరీ లాల్ శర్మని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కి కంచుకోటలుగా ఉండేవి. అయితే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.
Read Also: AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..
అయితే, ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని ఒప్పించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆమె మాత్రం నో చెప్పింది. దీనికి ఒక కారణం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను గెలిస్తే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురం కూడా పార్లమెంట్‌లో ఉంటామని, దీంతో బీజేపీ వంశపారంపర్య రాజకీయాలు అని చేసే విమర్శలకు మరింత అవకాశం ఇచ్చినట్లు ప్రియాంకా భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఆరోపణలకు భయపడే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఆమె నిర్ణయం ఓటర్లలో ప్రతికూల భావన కలిగిస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆమె పోటీ చేసి ఉంటే స్టార్ పవర్‌తో కాంగ్రెస్ లాభపడేదనే భావనని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కీలకమైన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.