Gyanvapi: ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇత్తేహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్ జ్ఞానవాపి వివాదంలో ‘జైల్ భరో’కి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జ్ఞానవాపి కేసులో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా, బారికెడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.
మరోవైపు, ఉత్తరాఖండ్ హల్ద్వానీలో మదర్సా కూల్చివేతపై కూడా తౌకీర్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ఇంటిపై బుల్డోజర్లు నడిపితే మేం ఊరుకుంటామా..? ఇప్పుడు ఏ బుల్డోజర్ చర్యలను సహించేది లేదు. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లకపోతే మమ్మల్ని మేం రక్షించుకుంటాం..చట్టం మాకు హక్కు కల్పించింది, ఎవరైనా మనపై దాడి చేస్తే అతన్ని అంతమొందించాలి’’ అంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ప్రధాని మోడీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Read Also: HMDA shiva balakrishna: బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాలు..
జ్ఞానవాపిని వదులుకోవాలని ఇటీవల యూపీ సీఎం యోగి పిలుపునివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రజా ఖాన్ నిరసనలకు పిలుపునిచ్చారు. పోలీసులు అడుగడుగున భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైనా నేరస్తులైతే, అతని ఇల్లు, మదర్సా, మసీదును ఎందుకు బుల్డోజర్‌తో ధ్వంసం చేస్తున్నారని తౌకీర్ రజా ప్రశ్నించారు. దేశంలో విద్వేషపూరిత వాతావరణం ఏర్పడిందని, దీనికి వ్యతిరేకంగా బరేలీ నుంచే దేశవ్యాప్త ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. దీనికి ముందు ఓ వీడియో సందేశంలో నమాజ్ తర్వాత శాంతియుత పద్ధతిలో, రాజ్యాంగ పరిమితుల్లో ఆందోళన, నిరసన నిర్వహించాలని తన అనుచరులకు ఆయన పిలుపునిచ్చారు.
రజా నిరసనల నేపత్యంలో బరేలీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇస్లామియా మైదాన్ వద్ద వేల మంది పోలీసులను మోహరించారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ని రంగంలోకి దించారు. హల్ద్వానీ ఘటన నేపథ్యంలో యూపీలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది.