Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు మోహన్ యాదవ్ పదవీ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో సుప్రీంకోర్టు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించొద్దని పేర్కొంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలున్న ఎంపీలో ఏకంగా 163 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే అనూహ్యంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కాదని, బీసీ నేత మోహన్ యాదవ్‌ని బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది.
ఈ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ పదవిని స్వీకరించారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హజరయ్యారు.