Mamata Banerjee: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు ఈ రోజు కొలువయ్యాడు. 500 ఏళ్ల కల ఈ రోజు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో నిజమైంది. దేశం మొత్తం అంతా శ్రీరామ నామంతో నిండిపోయింది. అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని ప్రముఖుల, లక్షలాది మంది భక్తుల సమక్షంలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది.
ఇదిలా ఉంటే రామ మందిర ప్రారంభోత్సవం రోజు, దీనికి పోటీ అన్న విధంగా బెంగాల్‌లో సీఎం, టీఎంసీ అధినేత్రి సోమవారం “సర్వమత” ర్యాలీని ప్రారంభించింది. కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో భారీ సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు ర్యాలీలో పాలుపంచుకున్నారు. కోల్‌కతాలోని హజ్రా మోర్ నుండి ‘సంఘటి మార్చ్’ను ప్రారంభించారు. నగరంలోని ఐకానిక్ కాళీఘాట్ ఆలయంలో పూజలు మరియు ప్రార్థనలు చేసిన తర్వాత శ్రీమతి బెనర్జీ ర్యాలీని మొదలుపెట్టారు. ర్యాలీ పార్క్ సర్కస్ మైదాన్‌లో జరిగే భారీ సభతో ముగియనుంది.
మమతా తీరుపై ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. రామ మందిర వేడుక రోజే ఈ ర్యాలీని చేయడంపై ఆమెను బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీఎంసీ రామ మందిరాన్ని బీజేపీ ఎన్నికల జిమ్మిక్కుగా వర్ణించింది. రాముడిని బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటుందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee begins all-faith harmony rally in Kolkata. pic.twitter.com/ht4SF8c1XK
— ANI (@ANI) January 22, 2024