Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. మార్చి నెలలో కేజ్రీవాల్ అరెస్టు జరిగితే, ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు మే నెలలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో 21 రోజుల పాల్గొన్న తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిని కోర్టు తిరస్కరించింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మధ్యాహ్నం తిరస్కరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉంటారు.