దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా జలాలను హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందులో భాగంగా ఆప్ అధినేతపై పోలీసులు కేసు బుక్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అల్లర్లను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, హాని కలిగించే ఉద్దేశ్యంతో ఒకరిపై తప్పుడు నేరం మోపడం మరియు పౌరుల మతపరమైన భావాలను అవమానించే ఉద్దేశపూర్వక మరియు హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి అభియోగాలు మోపబడ్డాయి.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్.. హర్యానా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యమునా నీళ్లలో బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. హర్యానా కోర్టు కూడా ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈనెల 17న న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Kolkata: క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన ప్రొఫెసర్ కీలక నిర్ణయం.. ఏం చేసిందంటే..!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా… ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు.
ఇది కూడా చదవండి: Prashanth Karthi : ఆ పాత్ర అందుకే ఒప్పుకున్నా: ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Bangladesh: ‘‘అత్యాచారాలు చేసిన పాకిస్తాన్‌ని ఏం అనవద్దు’’.. రేడియో, టీవీ కంటెంట్‌పై బంగ్లా నిషేధం..