Another Twist In Sonali Phogat Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్ మృతి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సుధీర్ సంగ్వాన్‌ను గోవా పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్న విషయం తెలిసిందే! ఆమెకు డ్రగ్స్ ఇచ్చి చంపేసినట్టుగా తేలడంతో, అతడ్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విస్టుల మీద ట్విస్టులు తెరమీదకి వస్తున్నాయి. తాజాగా.. సోనాలీ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఒక డైరీ దొరికింది. అందులో కొందరు రాజకీయ నేతలు, కార్యకర్తల ఫోన్ నంబర్లు ఉన్ననట్టు గుర్తించారు. అయితే.. వారి పేర్లను మాత్రం బయట పెట్టట్లేదు. ఎంతైనా ప్రజా పాలకులు కదా.. వారి పేర్లు బయటికొస్తే, అవమానపాలు అవుతారని రహస్యంగా ఉంచారు.
ఆ డైరీతో పాటు ఒక పాస్‌పోర్ట్, బంగారం, వజ్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అటు.. గోవాలోని సోనాలీ ఫోగట్ ఫాంహౌస్‌ని పరిశీలించిన పోలీసులకు, అందులోని కొన్ని విలువైన ఆస్తులు (వాహనాలతో సహా) మాయం అయినట్టు తెలిసింది. దీంతో, వాటిని కనుగొనే పనిలో పడ్డారు. కాగా.. సోనాలీ ఫోగట్ ఆస్తిని చేజిక్కించుకోవడం కోసమే సుధీర్ సంగ్వాన్ ఆమె హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఆస్తిపై అతడు ఎప్పట్నుంచో కన్ను వేశాడని, ఆస్తి కొట్టేందుకు చాలాకాలం నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడని తెలిసింది. సోనాలీ ఫోగట్ ఫాంహౌస్ సుమారు రూ. 110 కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఆ ఫాంహౌస్‌ను ఏటా రూ. 60 వేలు చెల్లించి, 20 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవాలని సంగ్వాన్ స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా.. హర్యానాలోని హిసార్‌కు చెందిన సోనాలీ ఫోగట్, టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. ఆ క్రేజ్ పుణ్యమా అని రాజకీయాల్లో ప్రవేశించింది. 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈమె.. కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయింది. 2020లో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఒక కంటెస్టంట్‌గా పాల్గొంది.