Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటన తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణమైంది. 19 ఏళ్ల యువతిపై వర్సిటీ క్యాంపస్‌లోనే లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి అధికార డీఎంకే పార్టీలో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. అధికార ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీతో పాటు అన్నాడీఎంకే పార్టీలు మండిపడుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ కేసుని మద్రాస్ హైకోర్టు సమోటోగా స్వీకరించింది. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటనను రాజకీయం చేస్తు్న్నారంటూ గురువారం హైకోర్టు మండిపడింది. “అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును రాజకీయం చేస్తున్నారు. మహిళల భద్రతపై అసలు ఏకాగ్రత లేదు” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై చెన్నైలో నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరించడంపై పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకె) కోర్టుని ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473కి.మీ రేంజ్..
ఈ కేసుని విచారించేందుకు జాతీయ మహిళా కమిషన్ (NCW) రిటైర్డ్ IPS అధికారి ప్రవీణ్ దీక్షిత్‌తో సహా ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల విచారణలో యూనివర్సిటీని సందర్శించిన కమిటీ, బాధితురాలు, ఆమె కుటుంబం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశమై క్యాంపస్ భద్రతను అంచనా వేసింది.
డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. తనపై, తన స్నేహితుడిపై దాడి చేసి దుండగులు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన కొద్దిసేపటికే, రోడ్డు పక్కన బిర్యానీ వ్యాపారి జ్ఞానశేఖరన్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడులో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ కేసుని విచారించేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్‌ని ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.