అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉంటుంది. మాటల్లో చెప్పగలమా? ఊహకందని ఏర్పాట్లు. సెట్టింగ్‌లు. కలర్‌ఫుల్ డిజైన్లు. విద్యుత్ కాంతులు, పూల డెకరేషన్లు.. ఇలా ఒక్కటేంటి? ధరించే బట్టల దగ్గర నుంచీ.. విందులో పెట్టే ఫుడ్ వెరైటీలన్నీ స్పెషల్‌గానే ఉంటాయి.
ఇకపోతే ముకేష్ అంబానీ ఇంట (Ambani family) జరుగుతున్న చివరి పెళ్లి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 1 నుంచి 3 వరకు జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం గుజరాత్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేరులు, కంపెనీల సీఈవోలు, ప్రముఖ జర్నలిస్టులు ఇండియాకు వచ్చేస్తున్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగాఉన్న పలు రంగాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖలతో పాటు ఆయా రాజకీయ ప్రముఖలు విచ్చేస్తున్నారు.
ఇంత గ్రాండ్‌గా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వచ్చే అతిథులకు కూడా అత్యంత అద్భుతమైన రుచులతో విందు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నోరూరించే వంటకాలన్నీ పెట్టబోతున్నట్లు సమాచారం.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ (Anant ambani Radhika merchants Pre wedding) కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుకల్లో అతిథులకు దాదాపు 2,500 రకాలైన రుచికరమైన వంటకాలను వడ్డించనున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్లు సమాచారం.
అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ నుంచి 21 మంది చెఫ్‌లను పిలిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.
ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో 75 వెరైటీలు, లంచ్‌లో 225, డిన్నర్‌లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నట్లు తెలుస్తోంది. ఇక మిడ్‌నైట్ స్నాక్స్‌తో పాటు అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించనున్నారు. ఇక భారత్‌లో పేరుగాంచిన కచోరీ, పోహా, జిలేబీ, భుట్టె కా కీస్, ఖోప్రా ప్యాటిస్ తదితర ఇందౌరీ వంటకాలను ప్రత్యేకంగా చేయనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పసందైన వంటకాలతో అతిథులను నోరూరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి వెరైటీలు పెట్టబోతున్నారో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.