మహారాష్ట్ర రాజకీయం హీట్ పెంచుతోంది.. గంట గంటకు పరిస్థితులు మారిపోతున్నాయి.. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన నంబర్ గేమ్.. పూటకో మలుపు తీసుకుటుంది.. ఓవైపు రెబల్స్ క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. శివసేన, మిత్రపక్షాలు మాత్రం బలనిరూపణలో నెగ్గుతామని ధీమాతో ఉన్నారు.. మనది మహారాష్ట్ర.. అసోంలో ఉండి మట్లాడడం కాదు.. ముంబై రావాలంటూ ఎమ్మెల్యేలను సూచిస్తున్నాయి శివసేన, ఎన్సీపీ.. దీంతో, ఏమి జరగబోతోంది? అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఇక, శివసేన జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో సీఎం ఉద్ధవ్ థాక్రే సమావేశం అయ్యారు.. ఆ తర్వాత శివసైనికులు దూకుడు పెంచారు.
Read Also: Revanth Reddy: ఖమ్మంలో పదికి 10 సీట్లు కాంగ్రెస్‌వే..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దూకుడు పెంచారు శివసేన క్యాడర్.. తిరుగుబాటు చేసిన పలువురు ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు తెగబడ్డారు.. తిరుగుబాటు సేన ఎమ్మెల్యే పోస్టర్లు, బ్యానర్లను తీసివేసి, వారికి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. వారిపై మండిపడుతూ నినాదాలు చేశారు.. మరోవైపు, మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసింది ప్రభుత్వం.. శివసైనికులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావొచ్చన్న సమాచారం పోలీసులకు చేరడంతో.. శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో, ఓవైపు ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? ఎవరు సీఎం అవుతారు? ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠతో పాటు.. శివసైనికులు భారీ సంఖ్యలో వీధుల్లోకి వస్తే పరిస్థితి ఏంటి? అనే టెన్షన్ కూడా మొదలైంది.