దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి కోర్ట్ ను కోరారు. మరోవైపు ఈ రోజు సుప్రీం కోర్ట్ లో జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలని వేసిన పిటిషన్ పై విచారించనుంది.
ఇదిలా ఉంటే జరుగుతున్న పరిణామాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. జ్ఞానవాపి మసీదుతో పాటు , కర్ణాటకలో జామియా మసీద్ విషయాలపై చర్చించనున్నారు. ఈ రెండు కేసులపై ఎలా మందుకు వెళ్లాలనే అంశాలపై పర్సనల్ లా బోర్డ్ చర్చించనుంది. మసీదు అంశాలతో పాటు దేశంలో ప్రస్తుత సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది.
జ్ఞానవాపీ మసీదు అంశం కోర్ట్ పరిధిలో ఉంటే కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. మాండ్యాలోని శ్రీరంగపట్టణలోని జామీయా మసీదు ఒకప్పుడు ఆంజనేయ దేవాలయం అని… తమకు పూజలు చేసుకునే అవకాశం ఇవ్వాలని నరేంద్రమోదీ విచార్ మంచ్ అనే గ్రూప్ మాండ్యా డిప్యూటి కమిషనర్ ను అనుమతి కోరింది. గతంలో టిప్పు సుల్తాన్ రాజధాని మైసూర్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మసీదు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. టిప్పు సుల్తాన్ హాయాంలో ఆంజనేయ స్వామి ఆలయంగా ఉన్నదాన్ని జామియా మసీదుగా మార్చారని.. ఇప్పటికీ మసీదుల్లోని పిల్లర్ల పై హిందూ శాసనాలు ఉన్నాయని నరేంద్ర మోదీ విచార్ మంచ్ సెక్రటరీ మంజునాథ్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉండేదని చరిత్ర చెబుతోందని.. టిప్పు సుల్తాన్, పర్షియన్ రాజుకు రాసిన ఉత్తరాల్లో కూడా ఈ ఆలయం గురించి సాక్ష్యాలు ఉన్నాయని మంజునాథ్ అన్నారు.