శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఓటింగ్‌కు అర్హత సాధించిన మొత్తం 285 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్‌సీపీ ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. మొత్తం ఆరు స్థానాలకు గానూ ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు. కాగా.. మహా వికాస్ అఘాడీ నుంచి ప్రఫుల్ పటేల్ (NCP) సంజయ్ రౌత్ (శివసేన), ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి (కాంగ్రెస్) గెలుపొందారు. కాగా.. శివసేన నుంచి పోటీచేసిన మరో అభ్యర్థి సంజయ్ పవార్ ఓటమిపాలయ్యారు.
మొత్తం 288 ఓట్లు కాగా.. 285 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్‌సీపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. అక్రమాస్తులు, మామూళ్ల వసూలు, మాఫియాతో సంబంధాలు తదితర ఆరోపణలపై ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే ఇటీవల మరణించారు. మరోవైపు కొందరు కాంగ్రెస్ సభ్యులు తాము ఓటేసిన బ్యాలెట్లను బహిరంగంగా ప్రదర్శించారని.. ఆ ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ నిలిచిపోగా.. శనివారం ఆ ఫలితాలను వెల్లడించారు.
అనారోగ్యంతో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ జగ్తాప్, ముక్తా తిలక్ అంబులెన్స్‌లో విధాన్ భవన్‌కు రాగా, శివసేన ఎమ్మెల్యే మహేంద్ర దల్వీ చేతికర్ర సహాయంతో వచ్చారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తాను శాసన మండలి సభ్యునిగా ఉన్నందున తాను ఓటరు కాదని, మహా వికాస్ అఘాడీ తరఫున నలుగురు అభ్యర్థులు గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.