Ajit Pawar: కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
గతేడాది అజిత్ పవార్, శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీని రెండుగా చీల్చారు. కీలకమైన నేతలు, మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వం ఎన్సీపీ కూడా చేరి ఎన్డీయే కూటమిలో మిత్రపక్షమైంది. అయితే, శరద్ పవార్ మాత్రం కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ ఇతర పార్టీలతో కూడిన ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు.
ఇరు వర్గాలు తమదే నిజమైన ఎన్సీపీ అని, ఎన్నికల గుర్తు కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శాసనసభలో ఎక్కువ మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలోనే ఉన్నారు. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన వర్గానికి ఒక పేరు పెట్టుకోవాలని శరద్ పవార్‌ని ఈసీ కోరింది. ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తన వర్గం పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కోరింది.