రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్‌పూర్‌లోని ఆయన ఇంటితో పాటు, ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించారు. తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ తనిఖీలు జరిపినట్లు చెప్పాయి.
కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎరువుల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణను ఎదుర్కొన్నారు. 2007, 2009 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో ఎరువులను చట్టవిరుద్ధంగా విదేశాలకు ఎగుమతి చేశారని ఈడీ పేర్కొంది. అగ్రసేన్ గెహ్లోత్‌కు చెందిన ‘అనుపమ్ కృషి’ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్’ అనే కంపెనీ ద్వారా మన దేశ రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన మ్యూరియేట్ ఆఫ్ పొటాష్‌ను అక్రమంగా విదేశాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ ఎరువుల కేసులో ఎక్స్‌పోర్టింగ్ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్’తోపాటు ఇతర కంపెనీలపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈడీ దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సోదరుడి నివాసంలో సోదాలు జరగడం గమనార్హం. కాగా, ఇవన్నీ ప్రతికార రాజకీయాలు అంటూ కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.