సోనియాగాంధీ ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోస్ట్ కొవిడ్ సమస్యలతో పాటు ఆమె దిగువ శ్వాసనాళంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఆమెకు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇటీవల కరోనా బారినపడ్డ ఆమె జూన్ 12న ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపించింది. కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు కోరడంతో ఆమెను ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ గతంలో సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోనియా ఆసుపత్రిలో ఉండగా.. రాహుల్ గాంధీ వరుసగా మూడు రోజుల పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోమారు విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనంటూ ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ మాత్రం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేయాల్సిందిగా ఈడీని విజ్ఞప్తి చేశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె ఆసుపత్రిలో ఉందని తెలిపారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. ఈడీ అతని విజ్ఞప్తిని అంగీకరిస్తూ, సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.