Mamata Banerjee: మహిళలపై లైంగిక వేధింపులతో ఇటీవల బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతం అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్రమోడీ టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
Read Also: PM Modi: మోడీ సభకు బలవంతంగా ప్రజల్ని తరలించారు.. కాశ్మీర్ నేతల ఆరోపణలు..
ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం మమతా బెనర్జీ మహిళలతో కోల్‌కతాలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. మహిళా దినోత్సవానికి ముందు ఆమె ఈ భారీ ర్యాలీని చేపట్టారు. మహిళలకు అత్యంత సురక్షితమైనది బెంగాల్ రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. చాలా మంది వ్యక్తులు సందేశ్‌ఖాలీపై తప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారని, ఏదైనా నేరం జరిగితే చర్యలు తీసుకుంటామని, తృణమూల్ నేతల్ని కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టనని అన్నారు. బీజేపీకి ఈడీ, సీబీఐలతో నాయకులను అరెస్ట్ చేయించడం, ఎన్నికల్లో గెలుపొందడం ఒక్కటే తెలుసని ఆరోపించారు. బెంగాల్‌పై కోపం ఎందుకని, మీరు ఎన్నికల్లో గెలవకపోతే ప్రతిపక్షం పరువు తీయడం ఎందుకని అడిగారు.
సందేశ్‌ఖాలి భూ కబ్జాలు, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా షేక్ షాజహాన్ ఉన్నాడు. ఇతడిని టీఎంసీ 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసు బీజేపీ, టీఎంసీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. బెంగాల్ మహిళలకు సురక్షిత రాష్ట్రం అంటూనే.. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, ఈశాన్య రాష్ట్రంలో లైంగిక హింసపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు.