యాసంగిలో వరి ధాన్యం సేకరణపై స్పష్టతను ఇవ్వాలని లోక్సభలో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అయిన వెంటనే కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీ నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.
టీఆర్ఎస్ ఎంపీల నినాదాల మధ్యనే ప్రశ్నోత్తరాలు జరగగా, కేంద్రం తీరుకు నిరసనగా లోక్సభ నుంచి టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వరిధాన్యం విషయం కొనుగోలు, ధాన్యం సేకరణపై మాటల యుద్ధం జరగుతున్న సంగతి తెల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తి లేదంటూ చెప్పింది ఈ నేపథ్యంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో నని టీఆర్ఎస్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.