AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య భారీ పోటీ నెలకొంది. పోటాపోటీగా ఇరు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా, ఆప్ మరోసారి ఢిల్లీ ప్రజలపై హామీల జల్లు కురిపించింది. సోమవారం తన మానిఫెస్టోని విడుదల చేసింది.
Read Also: USA: ట్రంప్ గురుద్వారాలను కూడా వదలడం లేదు.. అక్రమ వలసదారుల కోసం వేట..
నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మారుస్తాంమని, అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2100 అందిస్తామని వెల్లడించింది. సంజీవని పథకం కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడంతో పాటు నీటి సరఫరా బిల్లులు మాఫీ, 24 గంటల పాటు నీటి సరఫరాని కల్పిస్తామని చెప్పింది. యూరప్ తరహాలో రోడ్ల నిర్మాణం, యమూనా నది క్లీన్ చేయడం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ, రేషన్ కార్డులు మంజూరు, డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారాలు చూపిస్తామని చెప్పింది. ఆటో, టాక్సీ, ఈ- రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ. లక్ష సాయం,వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా అందిస్తామని వెల్లడించింది.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 08న ఫలితాలు విడుదలవుతాయి. గత రెండు పర్యాయాలుగా ఢిల్లీని ఆప్ ఏలుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ శాయశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తన పూర్వవైభవాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీలో ముక్కోణపు పోటీ నెలకొంది.