USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిని బలవంతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలోని గురుద్వారాలలో అక్రమ వలసదారుల్ని వేటాడుతున్నారు. అయితే, ఈ చర్యల్ని అనేక సిక్కు సంస్థలు విమర్శిస్తున్నాయి. ఇది తమ మతపరమైన స్థలాల పవిత్రతకు ముప్పుగా భావిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లోని గురుద్వారాలను సిక్కు వేర్పాటువాదులు, పత్రాలు లేని వలసదారులు సమావేశ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే వలసదారులపై చర్యలు మొదలయ్యాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) మరియు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అమలుపై బిడెన్ పరిపాలన మార్గదర్శకాలను రద్దు చేస్తూ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాత్కాలిక కార్యదర్శి బెంజమిన్ హాఫ్‌మన్ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. బైడెన్ హయాంలో గురుద్వారాల వంటి ప్రార్థనా స్థలాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి చర్యల్ని పరిమితం చేసింది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రావడంతో గురుద్వారాలను కూడా అధికారులు వదిలిపెట్టకుండా తనిఖీ చేస్తున్నారు.
Read Also: Ram Mohan Naidu: బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది..
ఈ చర్యలు ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడానికి, యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హత్యలు, రేపిస్టులను పట్టుకోవడానికి అవకాశం ఇస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అరెస్టులను నివారించడానికి నేరస్తులు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో దాక్కోలేరని చెప్పింది.
ఈ పరిణామాలపై సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ (SALDF) విధాన మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యలతో గురుద్వారాలను తనిఖీ చేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. గురుద్వారాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా, సమాజానికి సాయం చేస్తన్నాయని చెప్పారు. ప్రార్థనా స్థలాలతో పాటు ఆసుపత్రులు, పాఠశాలలు మరియు సామాజిక సేవా ప్రదాతలు వంటి ప్రాంతాలకు రక్షణను తొలగించిన విధాన మార్పును సిక్కు కూటమి కూడా విమర్శించింది.