లోక్‌సభలో ఈ-సిగరెట్‌పై దుమారం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ-సిగరెట్ తాగుతుంటే చూసినట్లుగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకొచ్చారు. దేశమంతా ఈ-సిగరెట్‌పై బ్యాన్ ఉన్నట్లుగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో లోక్‌సభ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ రూల్ పాస్ చేశారు. ఇకపై సభలో ఎవరైనా సిగరెట్ తాగినట్లుగా తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: భయంతో తప్పుడు భాష మాట్లాడారు.. అమిత్ షా ప్రసంగంపై రాహుల్ గాంధీ అభ్యంతరం
ప్రశ్నోత్తరాల సమయంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సభలో ఈ-సిగరెట్లు తాగడానికి అనుమతిస్తారా? అంటూ స్పీకర్‌ను అడిగారు. అందుకు ఓం బిర్లా ససేమిరా అన్నారు. దీంతో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సభలో తృణమూల్ ఎంపీ ఈ-సిగరెట్ తాగుతున్నారని తెలిపారు. అతని పేరు మాత్రం చెప్ప దల్చుకోలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఈ-సిగరెట్లు నిషేధించబడ్డాయని.. అయినప్పటికీ సభలో తాగుతున్నట్లు తెలిపారు. చాలా రోజులుగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇలా చేస్తున్నారని.. వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: India-UN: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులను ఖండిస్తున్నాం.. యూఎన్‌లో భారత్ ప్రకటన
ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ.. సభలో సభ్యులు గౌరవాన్ని కాపాడుకోవాలని.. లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇకపై ఇలాంటివి తన దృష్టికి వస్తే చర్య తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
2019 నాటి నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం ఉంది. భారతదేశంలో పూర్తిగా నిషేధించారు. తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, విక్రయించడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం లేదా ప్రకటన చేయడం చట్టవిరుద్ధం. పార్లమెంట్ రూల్ బుక్ ప్రకారం ధూమపానం నిషేధించబడిందని పేర్కొంది.