Kerala: 2005లో కేరళలో జరిగిన బీజేపీ కార్యకర్త ఎలాంబిలాయి సూరజ్ హత్య కేసులో 9 మంది సీపీఎం కార్యకర్తలను కోర్టు దోషులుగా తేల్చింది. దోషుల్లో సీఎం పినరయి విజయన్ ప్రెస్ సెక్రటరీ సోదరుడు కూడా ఉన్నాడు. శుక్రవారం వీరిందరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిని వారిలో టీకే రజీష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇతను 2012లో జరిగిన టిపీ చంద్రశేఖరన్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరో దోషి పీఎం మనోరాజ్, ఇతను సీఎం పినరయి విజయన్ సెక్రటరీ పీఎం మనోజ్ సోదరుడు.
Read Also: World Happiness Countries: ఎనిమిదోసారి టాప్ ప్లేస్ లో ఫిన్‌లాండ్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే
తలస్సేరి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి కేటీ నిసార్ అహ్మద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. మార్చి 24న శిక్షలు ఖరారు చేయనున్నారు. సీపీఎంను వీడి బీజేపీలో చేరిన తర్వాత, రాజకీయ శత్రుత్వం కారణంగా సూరజ్‌పై దాడి చేసినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. కేసు వివరాల ప్రకారం.. ఆగస్టు 07, 2005న ఉదయం 8.40 గంటల ప్రాంతంలో, ముజప్పిలంగాడ్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలో ఆటోరిక్షాలో వచ్చిన దుండగులు సూరజ్‌ను నరికి చంపారు.
మొత్తం 12 మంది నిందితుల్లో ఒకరు నిర్దోషిగా విడుదల కాగా, మరో ఇద్దరు విచారణ సమయంలో మరణించారు. రాజకీయ హింసా చరిత్ర కలిగిన కేరళలో ఈ కేసు రాజకీయ వివాదానికి కారణమైంది. తీర్పు వెలువడిన తర్వాత కన్నూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో కేరళ సెషన్స్ కోర్టు 2021లో జరిగి బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు మరణశిక్ష విధించింది. ఈ 15 మందినికి నిషేధిత పాపులర్ ఫ్రండ్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయి. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ని డిసెంబర్ 19, 2021న తన ఇంట్లో తన కుటుంబం ముందే దారుణంగా దాడి చేసి చంపారు.