Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
Read Also: Plane Crash: బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం.. 7 మంది మృతి!
గత ఆరు రోజుల్లో ఏకంగా 19 లక్షల మంది భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు. సగటు ప్రతీ రోజూ 2 లక్షల కన్నా ఎక్కువ మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జనవరి 23న ఆలయాన్ని తెరిచిన తొలిరోజే ఐదు లక్షల మంది భక్తులు పూజలు చేయడంతో రద్దీ ఎక్కువగా ఉంది. తరువాతి రోజుల్లో 24వ తేదీన 2.5 లక్షల మంది, 25 తేదీన 2 లక్షల మంది, 26న 3.5 లక్షల మంది, 27న 2.5 లక్షల మంది, 28న 3.25 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను నిశితంగా గమనించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.