ఇలయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న వ్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విజయ్ కి తెలుగులో మార్కెట్ అంతంత మాత్రమే. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్, సూర్య, కార్తీ, విశాల్ తెలుగునాట కూడా తమకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగినా విజయ్ మాత్రం ఈ వైపు దృష్టి పెట్టలేదు. ఇటీవల కాలంలో విజయ్ సినిమాలు తెలుగునాట కూడా ఏకకాలంలో విడుదల అవుతున్నాయి. అందుకు మాస్టర్ ఓ ఉదాహరణ. అందులో విజయ్ సేతుపతి ఉండటం కూడా ప్లస్ అయింది. నిజానికి విజయ్ కి మురుగదాస్ ‘తుపాకి’తో తెలుగులో కూడా గుర్తింపు వచ్చింది. కానీ దానిని క్యాష్ చేసుకోవటంలో విజయ్ విఫలం అయ్యాడు. తన సినిమాలు తెలుగునాట విడుదల అవుతున్నా ప్రచారంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదనే చెప్పాలి.
Read Also : Anasuya : మగజాతి పరువు తీస్తున్నారు… నెటిజన్ పై యాంకర్ ఫైర్
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు రిలీజ్ అవుతుంటే స్టార్స్ తమ మాతృభాషలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ముమ్మరంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకు ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఓ ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఎక్కడా ప్రచారం చేయను అని భీష్మించుకుంటే అది హీరోగా తనకే నష్టం. అదీ కాక విజయ్ కి పోటీగా ఈ సారి యశ్ ‘కెజిఎఫ్2’ కూడా వస్తోంది. ఒక్క రోజు గ్యాప్ లో వస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే యశ్ ఉత్తరాదిని చుట్టుముట్టి వస్తున్నాడు. తన తొలి భాగం కోసం కూడా యశ్ ముమ్మర ప్రచారం చేశాడు. అది విజయ్ కి ఎంతో ఇబ్బందిని కలిగించే అంశం. ఇప్పటి వరకూ విజయ్ ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. పాన్ ఇండియా మార్కెట్ కావాలంటే అడుగు బయట పెట్టాల్సిందే. మరి విజయ్ అందుకు సై అంటాడా!? రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.