Ghantasala: మధుర గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సరం ఇది. ఆ వేడుకలను వివిధ ప్రాంతాలలో యేడాదిగా జరుపుకుంటూనే ఉన్నాం. ఆయన జీవిత విశేషాలను తర్వాత తరాలకూ తెలియచేసేందుకు కొంతకాలం క్రితం సిహెచ్ రామారావు ‘ఘంటసాల ది గ్రేట్’ పేరుతో బయోపిక్ ను తీశారు. గతంలో సిహెచ్ రామారావు ‘ఘంటసాల పాటశాల’ పేరుతో ఘంటసాల సుప్రసిద్ధ గీతాలను సంకలం చేశారు. ఆయనే ఇప్పుడీ సినిమాకు రచయిత, దర్శకుడు. విశేషం ఏమంటే ఈ సినిమాలో ఘంటసాల దంపతుల పాత్రలను నిజ జీవితంలో భార్యాభర్తలైన మృదుల, కృష్ణచైతన్య పోషించారు. టీవీ యాంకర్ గా మృదులకు చక్కని గుర్తింపు ఉండగా, గాయకుడిగా కృష్ణచైతన్య ప్రసిద్థుడు. ఈ సినిమాను అన్యుక్త్ రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో గాయకుడు జి. వి. భాస్కర్ నిర్మాణ సారధ్యంలో ఘంటసాల అభిమాని శ్రీమతి లక్ష్మీ నీరజ నిర్మించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను పూర్తి చేసినట్టు అప్పట్లో దర్శకుడు సిహెచ్ రామారావు తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ ను కూడా ప్రముఖ గాయని చిత్ర చేతుల మీదుగా ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాంలో విడుదల చేయించారు. దానికి మంచి స్పందన వచ్చింది.
ప్రఖ్యాత హిందుస్తానీ సంగీత విద్వాంసులు బడే గులాం అలీఖాన్ గా సుమన్ నటించిన ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జె.కె. భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులి తదితరులు పోషించారు. సాలూరి వాసూరావు సంగీతం సమకూర్చారు. అనివార్య కారణాల వల్ల విడుదల కాకుండా ఆగిపోయిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీకి మోక్షం ఎప్పుడా అని ఆయన అభిమానులు, సంగీత ప్రియులు ఎదురుచూస్తున్నారు. కనీసం ఆయన శతజయంతిని పురస్కరించుకుని అయినా విడుదల చేస్తే చూడాలన్నది వారి ఆశ. అయితే ఇవాళ థియేట్రికల్ రిలీజ్ అనేది పెద్ద యజ్ఞంగా మారిపోయింది. దాని బదులు ఓటీటీలో రిలీజ్ చేసే బాగానే ఉంటుంది. ఎందుకంటే… ఇటీవల ఎల్ బీ శ్రీరామ్ నటించి, నిర్మించిన విశ్వనాథ సత్యనారాయణ బయోపిక్ ‘కవి సమ్రాట్’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. సాహిత్యాభిమానులను ఆ సినిమా ఆకట్టుకుంది. అదే తరహాలో ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని కూడా ఏదో ఒక ఓటీటీకి ఇస్తే… దర్శక నిర్మాతల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో పాటు, ఘంటసాల బయోపిక్ ను వీక్షించే భాగ్యం అభిమానులకూ దక్కుతుంది!