weekend Releasing movies..
థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా కొందరు నిర్మాతలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాత్రం థియేటర్లకూ వస్తూనే ఉన్నాయి. ఈ శుక్రవారం అలాంటి సినిమాలు ఏకంగా ఏడు థియేట్రికల్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో చెప్పుకోదగ్గది అక్కినేని నాగచైతన్య నటించిన ‘ధ్యాంక్యూ’ మూవీ. ‘దిల్’ రాజు, శిరీశ్ నిర్మించిన ఈ సినిమాను ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశారు. కథను బీవీఎస్ రవి అందించారు. రాశిఖన్నాతో పాటు మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. అవికాగోర్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనం ఇవ్వబోతోంది. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కావడం విశేషం. ఈ యేడాది సంక్రాంతికి నాగచైతన్య నటించిన ‘బంగర్రాజు’ విడుదలైంది. ఇప్పుడీ సినిమా వస్తోంది. వచ్చే నెలలో చైతు నటించిన తొలి హిందీ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కానుంది.
ఇక శుక్రవారం జనం ముందుకు వస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు సినిమా సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించిన ‘దర్జా’. పొలిటీషియన్ కామినేని శ్రీనివాస్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ మూవీని సలీమ్ మాలిక్ డైరెక్ట్ చేశాడు. ‘అమ్మ’ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘హై ఫైవ్’, అలానే కుప్పిలి శ్రీనివాస్ తానే హీరోగా నటించి, నిర్మించి, డైరెక్ట్ చేసిన ‘మీలో ఒకడు’ సినిమాలూ ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్ కీలక పాత్రలు పోషించిన ‘జగన్నాటకం’ మూవీ సైతం శుక్రవారం వస్తోంది. దీనితో పాటు శింబు, హన్సిక నటించిన ‘మహ’ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో రానుంది. ఇది హన్సిక నటించిన 50వ సినిమా కావడం విశేషం. రణబీర్ కపూర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘షంషేరా’ తెలుగు డబ్బింగ్ కూడా ఫ్రై డే జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే… ధనుష్ నటించిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో కాకుండా ఈ శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి వీటిల్లో ఏ యే చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుందో చూడాలి.