Vijay Deverakonda Liger Movie OTT Release Date: ఓటీటీలో సినిమాలను త్వరగా రిలీజ్ చేస్తుండడం వల్ల థియేటర్ల వైభవం దెబ్బతింటోందని.. వసూళ్లు కూడా తక్కువగా నమోదు అవుతున్నాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపి ఇటీవల ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని తీసుకొచ్చారు. థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత కనీసం 50 రోజుల వరకూ ఓటీటీలో సినిమాలను స్ట్రీమ్ చేయకూడదని ఓ కండీషన్ పెట్టారు. తొలుత 10 వారాల గ్యాప్ పెట్టాలని అనుకున్నారు కానీ, అది మరీ ఎక్కువ వ్యత్యాసం అవుతుందన్న ఉద్దేశంతో 50 రోజులకు కుదించినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ‘బింబిసార’ను 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నట్టు స్వయంగా నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు. ఈ క్రమంలోనే.. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘లైగర్’ను ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఇంత త్వరగా ఈ చర్చ తెరమీదకి రావడానికి ఓ కారణం ఉంది.
ఇంతకుముందు ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా రాణించకపోతే.. మొదట్లో కుదుర్చుకున్న ఒప్పందం కన్నా ముందే ఓటీటీలో స్ట్రీమ్ చేశారు. మంచి వసూళ్లు కురిపించిన సినిమాలకు మాత్రమే కొంత ఎక్కువ గ్యాప్ ఇచ్చారు కానీ, మిగతా వాటిని వెంటనే ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లైగర్ సినిమాకి కూడా మిక్స్‌డ్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే పెర్ఫార్మెన్స్ కనబరుస్తుండడంతో.. గతంలోలాగే ఈ చిత్రాన్ని త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి తీసుకొస్తారా? లేక కొత్త నిబంధనల ప్రకారం 50 రోజుల వరకు గ్యాప్ ఇస్తారా? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, కొత్త నిబంధనల ప్రకారం ఏ సినిమా అయినా 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుందని తేలింది. ఈ లెక్కన.. అక్టోబర్ మొదటి వారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ భారీ మొత్తానికే సొంతం చేసుకున్నట్టు సమాచారం.