టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చిన తర్వాతే డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ కేటాయించాలి అని నిర్మాతల మండలి చెప్పడంతో ‘వారిసు’ వివాదం మొదలయ్యింది. సంక్రాంతి సీజన్ లోనే చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలని కాదని డబ్బింగ్ సినిమా అయిన ‘వారసుడు’కి దిల్ రాజు ఎక్కువ థియేటర్స్ ఎలా కేటాయిస్తాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు మాత్రం ఈ కామెంట్స్ పట్టించుకోకుండా, ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కి లేనిది వేరే వాళ్లకి ఎందుకు అనేది దిల్ రాజు వర్షన్. డిస్ట్రిబ్యూటర్స్ తో తనకి ఉన్న రిలేషన్ కారణంగా ‘వారసుడు’ సినిమాకే మంచి థియేటర్స్ వస్తాయనేది దిల్ రాజు మాట. అయితే సంక్రాంతి సీజన్ దగ్గర పడే కొద్దీ ఈ థియేటర్స్ గొడవ పెరుగుతూనే ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇస్తారు అనే డిస్కషన్ ఇండస్ట్రీతో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా మొదలయ్యింది. ఇలాంటి వేడి వేడి వాతావరణంలో ‘వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషణ్ అసోషియేషన్’ ఎగ్జిబిటర్స్ ని ఉద్దేశిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. సంక్రాంతి, దసరా సీజన్స్ లో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ థియేటర్స్ కేటాయించాలని ‘వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషణ్ అసోషియేషన్’ ఎగ్జిబిటర్స్ ని కోరారు. దీంతో ‘వారసుడు’ థియేటర్స్ గొడవ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
‘వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషణ్ అసోషియేషన్’ లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన తమిళులు, మా హీరో సినిమాకి అన్యాయం జరిగితే తమిళనాడులో తెలుగు సినిమాలకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం ముదిరి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల మధ్య గ్యాప్ పెరిగే లోపు, సినీ పెద్దలు కూర్చోని ఈ ఇష్యూని పరిష్కరించడం మంచింది. మరి సంక్రాంతికి ఇంకా నెల రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈలోపు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ కూర్చోని మాట్లాడుకోని థియేటర్స్ ఇష్యూని సాల్వ్ చేస్తారేమో చూడాలి.