భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ మరువలేని క్లాసిక్‌లలో ఒకటైన చిత్రం రంగీలా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కేవలం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, సంగీతం, కథనం, నటన అన్నీ కలిపి ఒక మాజిక్‌ని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా హీరోయిన్ ఊర్మిళ కెరీర్ స్టార్‌డమ్‌ను అందుకుంది. రంగీలాతో ఊర్మిళ గ్లామర్, టాలెంట్‌కి కొత్త నిర్వచనం ఇచ్చారు అని చెప్పాలి. ఈ చిత్రానికి ఇప్పుడు 30 ఏళ్లు పూర్తవుతుండగా, ఆ ప్రత్యేక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఊర్మిళ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించారు.
ఊర్మిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియో షేర్ చేశారు. అందులో ‘రంగీలారే’ అనే ఐకానిక్ సాంగ్‌కి స్టెప్పులేస్తూ అభిమానులను మళ్లీ ఆ మాజిక్లోకి తీసుకెళ్లారు. ఆ వీడియోతో పాటు ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్ కూడా రాశారు. ‘‘రంగీలా కేవలం ఒక సినిమా కాదు, అది ఒక గొప్ప అనుభూతి. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ప్రతి పాట కేవలం సంగీతం కాదు, నవరసాల వేడుక. ముప్పై ఏళ్ల క్రితం ఈ సినిమా మీ అందరినీ ఆకర్షించింది. నేటికీ అది అదే శక్తితో మిమ్మల్ని ఆ మొదటి క్షణానికి తీసుకెళ్తుంది. నా జీవితంలో భాగమై నన్ను ప్రేమతో ఆలింగనం చేసుకున్నందుకు ధన్యవాదాలు. కలలు కనే ధైర్యాన్ని ఇచ్చి, నన్ను ఒక ప్రత్యేక స్థానంలో నిలిపిన మీ మద్దతు నా జీవితంలో గొప్ప వరం’’ అని ఊర్మిళ తన మనసులోని మాటలను వ్యక్తం చేశారు.
ఊర్మిళ చేసిన ఈ పోస్ట్ చూసిన అభిమానులు నోస్టాల్జిక్ అయ్యారు. అప్పటి జ్ఞాపకాలను తలచుకుంటూ, ఆమె అందం, అభినయం, ఆరా గురించి పొగడ్తలతో కామెంట్లు చేస్తున్నారు. ఆమిర్ ఖాన్‌తో ఊర్మిళ జోడీ చేసిన మ్యాజిక్కి ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉందని, ఇలాంటివి మళ్లీ రావడం కష్టమేనని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి రంగీలా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఊర్మిళ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సినీ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతి ఇచ్చిందని చెప్పాలి.