Santosh Shoban: పాతికేళ్ళు తండ్రి మీద ఆధారపడి, ఆ తర్వాత భార్య మీద ఆధారపడి జీవితాన్ని గడిపేయాలనుకునే కుర్రాడికి… హఠాత్తుగా మనస్సాక్షి మేల్కొని… జ్ఞానోదయం కలిగితే ఏం జరుగుతుంది!? ‘కళ్యాణం కమనీయం’ కథ అలాంటిదేనని ఆ మూవీ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఇందులో కోలీవుడ్ భామ ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేశారు.
ఈ ట్రైలర్ లో చూస్తే… శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను సంతోషపెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి. శివ ఉద్యోగం సంపాదించి శృతిని హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. శివకు ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా ఎమోషనల్ గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ఇది ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరీ ఏమిటనేది చెప్పకనే చెప్పేశాయి. మొత్తంగా అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సన్నివేశాలను కూర్చిన తీరు, సంభాషణలు, నేపథ్య సంగీతం అన్నీ చక్కగా అమరి, సినిమా మీద ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ఉంది.
ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘తెగింపు’ వంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. అలానే ‘కళ్యాణం కమనీయం’ వంటి ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా రాబోతోంది. మరి ఆ పెద్ద చిత్రాలతో పాటు ఈ క్యూట్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూ ప్రేక్షకులు పట్టం కడతారేమో చూద్దాం!!