రామ్ గోపాల్ వర్మ్ తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన పూజా భాలేకర్ మీడియాతో మాట్లాడింది. చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్ మీద తాను ఫోకస్ పెట్టాను తప్పితే నటి కావాలని అనుకోలేదని పూజా తెలిపింది. బ్రూస్ లీ ప్రేరణతో వర్మ ‘లడకీ’ సినిమా తీయాలని అనుకుని తనను అప్రోచ్ అయ్యారని, ఆయన ఆఫీస్ నుండి ఫోన్ రాగానే తండ్రితో కలిసి ముంబై ఆఫీస్ కు వెళ్ళానని, తానిచ్చిన ఆడిషన్ నచ్చి, తనను ఎంపిక చేశారని పూజా చెప్పింది. అయితే ఈ సినిమా అంగీకరించడానికంటే ముందే తాను వర్మ అభిమానని ఆయన రూపొందించిన ‘రంగీలా, సత్య, సర్కార్’ చిత్రాలను చూశానని, అందువల్ల ఆయన సినిమాలో ఛాన్స్ రావడం ఆనందాన్ని కలిగించిందని చెప్పింది.
తాను నటించిన తొలి చిత్రమే ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం అస్సలు ఊహించని విషయమని చెబుతూ, ”మొదట్లో ఈ చిత్రాన్ని ఇన్ని భాషల్లో విడుదల చేస్తామని అనుకోలేదు. నాకు తెలిసి వర్మ సర్ కూడా ఊహించి ఉండరు. షూటింగ్ ప్రారంభమయ్యేకంటే ముందే.. ఎన్నో టెస్ట్ షూట్స్ చేశారు. వాటిని కొన్ని ప్రొడక్షన్ కంపెనీలకు చూపించడం, వారికి ఎంతో నచ్చడంతో ఈ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేశారు” అని తెలిపింది. ఈ సినిమాలోని తన పాత్ర గురించి తెలుపుతూ, ”ఈ మూవీలో నా పేరు పూజా కానిక్. నేను వర్మ సర్‌ను కలవడానికి ముందే పాత్రకు ఆ పేరు ఫిక్స్ చేశారు. నా పేరు కూడా అదే అయింది. ఇదే విధి అనుకున్నాను. అందుకే నేను ఇక్కడకు వచ్చానని భావించాను. పూజాకు బ్రూస్‌లీ అంటే ఇష్టం. అతను చేసే మార్షల్ ఆర్ట్స్, ఆయన ఫిలాసఫీ అంటే పిచ్చి. ఆయన మీదున్న ప్రేమతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఆమెకు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలతో ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ అవసరమని అనుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలతో జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అవన్నీ తెరపై చూడటానికి బాగుంటాయి” అని చెప్పింది.
చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడానికి కారణం వివరిస్తూ, ”చిన్నతనంలో యోగా చేసేదాన్ని. ఆ తరువాత అథ్లెట్‌గా మారాను. ఓ సారి చిన్న పిల్లలు మా స్కూల్ గ్రౌండ్‌లో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారు. అప్పుడు నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. నిజానికి అప్పటికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో నాకు తెలియదు. దాని ప్రాముఖ్యత ఏంటో కూడా తెలీదు. అయితే నేర్చుకుంటాను అనే విషయాన్ని ఇంట్లో చెప్పాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఎన్నెన్నో మెడల్స్, అవార్డ్స్ వచ్చాయి. ఇక ఇదే కెరీర్‌గా ఎంచుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఇప్పుడీ సినిమా ద్వారా మార్షల్ ఆర్ట్స్ గొప్పదనాన్ని అందరికీ తెలియచెప్పడం ఆనందాన్ని కలిగించింది” అని తెలిపింది.
ఈ మూవీలో పూజా యాక్షన్ తో గ్లామర్ నూ వెండితెరపై పండించింది. ఆ విషయాలను గురించి చెబుతూ, ”నాకు మార్షల్ ఆర్ట్స్ మాత్రమే వచ్చు. అయితే ఈ సినిమాలో గ్లామర్ కూడా ఉండాలన్నారు. అందుకే నాకు నేనుగా గ్లామర్‌గా కనిపించేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే ఈ సినిమా తరువాత నాకు మరిన్ని అవకాశాలు రావాలి. అందుకే నేను గ్లామర్ పరంగా అందంగా కనిపించాలని అనుకున్నాను. యాక్షన్, ఫిట్ నెస్, గ్లామర్ పరంగా నేను పర్ఫెక్ట్ అని చూపించాలనుకున్నాను. గ్లామరైనా, యాక్షన్ అయినా ఏదైనా చేయగలను అని చెప్పదల్చుకున్నాను. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేశాను. రాబోయే రోజుల్లో నా పాత్ర ప్రత్యేకంగా, స్ట్రాంగ్‌గా ఉంటే తప్పకుండా నటిస్తాను. ‘అమ్మాయి’ సినిమాను ఆర్జీవీ సర్ ఒక లెవెల్‌లో తెరకెక్కించారు. ఆ బార్ హై-లెవెల్‌లో ఉంది. దాని కంటే తక్కువగా అనిపిస్తే చేయను. ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను” అని తన మనసులో మాటను వివరించింది.